సివిల్ వర్సెస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.... ఇరకాటంలో ఇన్ఫార్మరులు....

Submitted by SANJEEVAIAH on Mon, 29/05/2023 - 12:02

ఇరుకున పడిన ఇన్ఫార్మరులు

సమాచారం ఇచ్చినందుకు పోలీసుల వేదింపులు

సివిల్ వర్సెస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు

నిజామాబాద్ క్రైమ్, ప్రజాజ్యోతి, మే 29 :


నిజామాబాద్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల సరఫరా పోలీసులకు సవాల్ గా మారింది. ఇందులో టాస్కఫోర్స్ పోలీసుల రెండు గ్రూప్ ల్లో ఒక గ్రూప్ వసూళ్ళ వివాదాల్లో ఉండగా రెండో గ్రూప్ గంజాయి పట్టుకున్నందుకు సమాచారం ఇచ్చిన వారు వివాదాల్లో చిక్కుకున్నారు. పోలీసులు డ్రగ్స్ బాధితులను అరెస్టు చేసి వారిని అప్రువర్ గా మార్చి సరఫరాదారులను పట్టుకోవడం ఆనవాయితీ. తాస్కుఫోర్స్ లోని ఓ టీమ్ ముగ్గురిని అప్రువార్ గా మార్చి గంజాయి సప్లయ్ చేసే వారిపై దాడులు చేశారు. ఇలా కిలోల కొద్ది గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి పంపించారు. ఇటీవల జరిగిన రెండు మూడు సంఘటనలతో గంజాయి సప్లయిదారులు ఇన్ఫర్మర్లను టార్గెట్ చేశారు. అనుకున్నదే తడువుగా సదరు వ్యక్తులకు ఫోన్ ద్వారా బెదిరింపులకు గురి చేయడం మొదలు పెట్టారు. బెదిరింపులను విన్న వారు సంబధిత వ్యక్తుల ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. దీంతో కొత్త వివాదం మొదలు అయింది. ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని సివిల్ పోలీసులు ఇన్ఫర్మర్ లను ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టారు. సంబంధిత వ్యక్తులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగడం గమనార్హం. 

సివిల్ వర్సెస్ టాస్కుఫోర్స్

గంజాయి, మత్తు పదార్థాల వ్యవహారంలో సివిల్ పోలీసులకు టాస్కఫోర్స్ పోలీసులకు మధ్య వార్ కొనసాగుతుంది. సివిల్ పోలీసులు ఏరియా కోసం వాదనలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు జరుగుతున్న వ్యవహారం నెట్ వర్క్ విషయంపై మాట్లాడుతున్నారు. మా ప్రాంతంలో సంఘటన జరిగినప్పుడు సమాచారం ఇవ్వాలని సివిల్ పోలీసులు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఇన్ఫార్మలకు తలనొప్పిగా మారింది. పోలీసు శాఖలోని సివిల్, టాస్క్ ఫోర్స్ పోలీసులు నువ్వా నేనా అనుకుంటూ కొత్త సమస్యను సృష్టిస్తున్నారు. బోధన్ లో, రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి పట్టించిన ఇన్ఫార్మరులు పోలీసులకు సహకరించిన పాపానికి కొత్త కేసుల్లో ఇరుక్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలీసు శాఖలోని రెండు విభాగాలను సమన్వయం చేయాల్సిన పోలీసు కమిషనర్ (సీపీ) లేకపోవడంతో కొందరు పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.