బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలి.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 11:45
 Bankers have to fulfill the specified targets.  District Collector Rahul Raj..

పోటో రైట్ ప్;సమీక్ష సమావేశం లో మాట్లాడు తున్న కలెక్టర్ రాహుల్ రాజ్..
ఆసిఫాబాద్,సెప్టెంబర్,21,(ప్రజా జ్యోతి) .../ 
జిల్లా అభివృద్ధి, రైతుల సంక్షేమం దిశగా బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి వివిధ బ్యాంకుల అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులతో త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంట రుణాలకు గాను 2వేల 469 కోట్ల రూపాయలు లక్ష్యంగా కేటాయించగా జూన్ మాసాంతం నాటికి 272 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 90 శాతం, లీడ్ బ్యాంకు ద్వారా 10 శాతం రుణ మంజూరు జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయని, ఉపాధి, పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు  రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని బ్యాంకులలో 67 శాతం ఖాతాదారులకు మొబైల్ అనుసంధానం,  80 శాతం ఆధార్ అనుసంధానం జరిగిందని, 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధిక శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని, జిల్లాలో 1 లక్ష 18 వేల మంది రైతులు రైతుబంధు పొందుతున్నారని, జిల్లాలో ఖరీఫ్ పంటను మాత్రమే సాగు చేస్తున్నారని, బ్యాంకర్లు రుణ సదుపాయం ద్వారా రైతులను ప్రోత్సహిస్తే రవి పంటను సాగు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల అభివృద్ధి దిశగా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని, ఆయా రంగాల వారీగా మంజూరు చేసిన రుణాల వివరాలతో అన్ని బ్యాంకులు నివేదిక అందించాలని ఆదేశించారు. గిరి వికాసం పథకంలో భాగంగా జిల్లాలోని 100 గ్రామాలకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కోవ హనుమంతరావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి అలీ బాబా, నాబార్డ్ డి.డి.ఎమ్. రవూఫ్ ఖాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, వివిధ బ్యాంకుల అధికారులు, ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..