సహజ వనరుల సంరక్షణే బతుకమ్మకు సంరక్షణ

Submitted by lenin guduru on Tue, 27/09/2022 - 22:55
బహుజన బతుకమ్మలతో విమలక్క

 

*కుల వివక్ష, పరువు పేరిట జరిగే దారుణాలను ఖండిద్ధాం*

*మంచుప్పుల దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా*

 *బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ప్రజా గాయని విమలక్క*

పాలకుర్తి, సెప్టెంబర్ 27, ప్రజాజ్యోతి :-
 సహజ వనరుల పరిరక్షణే బతుకమ్మకు సంరక్షణ అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క అన్నారు.  
జనగాం జిల్లా పాలకుర్తి మండలం లోని మంచుప్పుల గ్రామంలో  బహుజన బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విమలక్క ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆట ఆడారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాకర్ల రమేష్ సభాధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విమలక్క మాట్లాడుతూ.. భూమి, గుట్టలు, చెరువులు, వాగులు వంకలు,  సహజ వనరులను కాపాడుకుంటూనే మానవ మనుగడ ఉంటుందని తెలిపారు. ప్రకృతి సృష్టే బతుకమ్మ అని, ప్రకృతిని కాపాడుకుంటేనే బతుకమ్మ మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. 
బతుకమ్మకు కులంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతవనిలో వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సమయాల్లో కూడా దళితులపై వివక్ష కొనసాగుతోందని రెండు గ్లాసుల పద్ధతి ఉందని ఆమె అన్నారు.  పరువు పేరుతో హత్యలు చేస్తున్నారని, హత్యలు చేస్తే పరువు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. ప్రేమ వివాహాల్ని అంగీకరించలేని పరిస్థితి ఏర్పడిందని, మనుషులంతా సమానమేనని,  పరువు పేరుతో చేసే దారుణాలను ప్రతి ఒక్కరు ఖండించాలని తెలిపారు.  
 మంచుప్పుల దళితుల భూమి సమస్యపై సీఎం కేసీఆర్ కు లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు.  40 ఏళ్ల క్రితం దళితులకు భూమి కేటాయించారని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిందని, వాటిని దళితులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. 283 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళితుల సమస్య పై స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తక్షణమే స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు దళితుల అది న్యాయమైన డిమాండ్ అని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు వారికి న్యాయం జరిగే వరకు పండగ ఉంటామని ప్రకటించారు. 
ఈ కార్యక్రమంలో సిపిఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, రైతు సంఘం  నాయకులు బత్తుల సత్తయ్య, సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమసత్యం, రైతు సంఘం నాయకుడు నాగన్న, కళాకారులు మధుసూదన్, పద్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు..