సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వర్లు పై దాడి హేయమైన చర్య

Submitted by narmeta srinivas on Fri, 18/11/2022 - 20:12
సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వర్లు పై దాడి హేయమైన చర్య

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 18 : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బైరబోయిన వెంకటేశ్వర్లు పై దాడి చేయడం ఏమైనా చర్య అని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జై భారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ భూక్య శ్రీను నాయక్, ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర నాయకుడు వల్లూరి మధు మాదిగ అన్నారు. శుక్రవారం కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుమలగిరిలో గత 27 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉంటూ, అనేక ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి, సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తూ జర్నలిస్టు వృత్తిలో నిబద్ధతతో నిలబడ్డ సీనియర్ పాత్రికేయుడు బైరబోయిన వెంకటేశ్వర్లు అని అన్నారు. దళిత బంధు పథకంలో రాజకీయం చోటుచేసుకుని అర్హులకు అందకుండా అక్రమాలు జరుగుతున్నాయని పత్రికలో వార్త రాశాడని కక్ష పెట్టుకుని గత మంగళవారం అతనిపై దాడి చేయడం పత్రిక స్వేచ్ఛపై దాడి చేయడం గానే భావిస్తున్నామని అన్నారు. ఒకవేళ ఆ వార్తపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పత్రికాముఖంగా వివరణ ఇచ్చుకోవాలి కానీ అలా కాకుండా అధికార బలం ఉందని పాత్రికేయుడు పై దాడి చేయడం తీవ్రమైన విషయమని, దాడి చేసిన వారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేసి చట్టబద్ధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన న్యూస్ సీఈవో జిలకర కృష్ణకర్, మన బలం పత్రిక తెలంగాణ ఇన్చార్జి వెలిశాల శ్యాం కుమార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.